Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 5:44 pm Posted by : ramakrishna

ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలి

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం బాన్సువాడ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాల్సి ఉంటుందని, ఎన్నికల నియమ నిబంధనల మేరకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని అన్నారు.  శిక్షణ తరగతుల్లో వివరించిన  ప్రతీ అంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన హ్యాండ్ బుక్ ను తప్పనిసరిగా చదువుకుని ఎన్నికల మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు . ఏమైనా సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.  నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. నామినేషన్లు, స్క్రూటినీ, అప్పీలు వంటివాటికోసం సమయ పాలనను పక్కాగా పాటించాలని తెలిపారు.  బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షరమాల క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని అభ్యర్థి పేరును అక్షరక్రమం కోసం పరిగణలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. వెంటదివెంట రోజువారీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి ఆక్షేపణలు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆర్డీఓ ప్రభాకర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, మాస్టర్ ట్రైనర్స్ నాగరాజు, సురేందర్, శ్రీనివాస్ లు, ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Election duties should be performed carefully