Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 6:33 pm Posted by : ramakrishna

వినియోగదారుల కమిషన్ లో వృద్ధ దంపతుల విజయం

  • జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మొట్టికాయలు
  • రూ.2 లక్షలు వడ్డీతో సహా చెల్లింపునకు ఉత్తర్వులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్  అనుకూలంగా ప్లాటినమ్ జూబ్లీ సర్టిఫికెట్ పథకంలో పేర్కొనబడిన విదంగా వినియోగదారులు డిపాజిట్ నగదు రూపాయలు మ్యాచురిటీ తీరినందున వారికి రెండు లక్షల రూపాయలు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కమిషన్ అధ్యక్షురాలు సువర్ణ జయశ్రీ, సభ్యులు ఐ. నాగేశ్వర్ రావు, సుమ వల ఉమ్మడిగా వ్రాసిన ఉత్తర్వుల వివరాలు.. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని కంఠం గ్రామానికి చెందిన భార్యభర్తలైన పెంట లింగుబాయి, పెంట నడిపి భూమన్న నందిపేట్ మండల కేంద్రంలోని నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ నందు బ్యాంకు వారి “ప్లాటినమ్ జూబ్లీ సర్టిఫికెట్”పథకంలో భాగంగా లింగుబాయి, భూమన్న ఒక్కొక్కరు 3,122,రూపాయలు 21 ఆగస్టు,1997 న బ్యాంకు నందు డిపాజిట్ చేశారు. అందుకు అనుగుణంగా బ్యాంకువారు ప్లాటినమ్జూబ్లీ సర్టిఫికెట్ ఇచ్చారు. పథకంలో పేర్కొనబడిన విదంగా పదేళ్ల కాలానికిగాను తేదీ 21 ఆగస్టు,2007 నాటికి 12,493 రూపాయలు మ్యాచురిటీ అయింది. తిరిగి వాటిని బ్యాంకు రెన్యూవల్ చేసుకోగా అవి 22 ఆగస్టు,2017 నాటికి పదేళ్ళ కాలానికి 49,990 రూపాయలు అయినాయి. మరో ఐదేళ్ల కాలానికి వాటిని బ్యాంకు అనగా 21 ఆగస్టు,2022 వరకు మొత్తం లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇవన్ని ప్లాటినమ్ జూబ్లీ సర్టిఫికెట్ పథకంలోనే భాగంగా 21 ఆగస్టు,1997 లోనే బ్యాంకు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికెట్ లో పేర్కొన్నారు. ఇరవై ఐదేళ్ల తరువాత మ్యాచురిటీ తీరిన అనంతరం  ఆగస్టు,2022 లో వారు బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ పథకం అనుసారం తమకు రావలసిన లక్ష రూపాయలు ఇవ్వమని దరఖాస్తు చేయగా బ్యాంకు వారి అభ్యర్థనను తిరస్కరిస్తు ప్రస్తుత నిబందనలు,వడ్డీరేట్ల మార్పు ఫలితంగా అంత మొత్తం చెల్లించలేమని 35 వేలు మాత్రమే చెల్లిస్తామని తెలిపింది. ఆ ఖరుగా 39,996 రూపాయలు ఇవ్వగలమని తెలిపింది.72 ఏళ్ల లింగుబాయి, 82 ఏళ్ల భూమన్న తమ న్యాయవాది గాలిపల్లి వెంకటేశ్వర్ ద్వారా నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో 2023సంవత్సరంలో నందిపేట్ సహకార బ్రాంచి ని,జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అపొజిట్ పార్టీలుగా పేర్కొని పిర్యాదు చేసారు.బ్యాంకు జారీ చేసిన అధికారిక ధ్రువపత్రాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ పేరున ఉన్న ప్రొసీడింగ్స్ పత్రాలు,చీఫ్ ఎక్సిక్యూటివ్ అపీసర్ ప్రొసీడింగ్స్, రిజర్వు బ్యాంకు గైడ్ లైన్స్,డిపాజిట్ సర్టిఫికెట్ లను అధ్యయనం చేసిన కమిషన్ పిర్యాదు దారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షలు మరియు 21 ఆగస్టు,2022 నుండి 7.5 శాతం వడ్డీతో సహా చెల్లించాలని తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు.