. . . అదనపు కలెక్టర్ వి.భుజంగరావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఈ వేడుకకు సంబంధించి వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్, ఆర్టీసీ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంద్రాగస్టు వేడుకకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని అన్నారు. ఎక్కడ కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువు లోపు పంపించాలని ఆదేశించారు. సన్నాహక సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, జెడ్పి సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్,. డీఆర్డీఓ సాయన్న, కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
