Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 8:52 pm Posted by : ramakrishna

ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి

 

. . . పీసీసీ అధ్యక్షుడికి ఎరుకల గిరిజనుల వినతి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఏకలవ్య జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎరుకల గిరిజనుల హక్కుల ఐక్య పోరాట సాధన సమితి (కుర్రు) రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయికుమార్ కోరారు. ఈ మేరకు నిజామాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఆదివారం సాయంత్రం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీన తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించనున్న ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించేలా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ, అంశాన్ని పరిశీలించి తన వంతు ప్రయత్నంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు కోనేరు సాయికుమార్ తెలిపారు. సమయాభావం ఉన్నప్పటికీ సాధ్యమైన మేరకు ఈ అంశంపై కృషి చేస్తానని ఆయన పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అట్టడుగు గిరిజన తెగలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంకా పూర్తిస్థాయిలో చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎరుకల గిరిజనులు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. విలువిద్యలో అసాధారణ ప్రతిభ కనబరిచిన మహావీరుడు ఏకలవ్య వారసులుగా భావించే ఎరుకల గిరిజనులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

 

Ekalavya Jayanthi should be celebrated officially.