Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 6:31 pm Posted by : ramakrishna

ఈద్ మీలాద్ ఉన్ నబీ వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అక్బర్ నగర్, సులేమాన్ నగర్ గ్రామాలలో ఈద్ మిలాద్-ఉన్- నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక ఊరేగింపులు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ముస్లిం సోదరులు గుర్రాలు, పచ్చజెండాలు చేతబుని  భక్తిశ్రద్ధలతో అల్లాహ్, మహమ్మద్ ప్రవక్తను స్మరిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక ర్యాలీతో రుద్రూర్ మండల  కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. ర్యాలీ సందర్భంగా కుల మతాలకు అతీతంగా బిఆర్ఎస్ పార్టీ వారు సులేమాన్ నగర్ గ్రామంలో పండ్లు పంపిణీ చేశారు. రుద్రూర్ లో ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం అక్బర్ నగర్ వారితో పాటు పలువురు ర్యాలీలో పాల్గొన్న వారికి  ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ర్యాలీలో పాల్గొన్న వారికి నీరు, బిస్కెట్స్, జ్యూస్, పాయసం అందించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ముస్లిం మత గురువులు  మహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర, జీవన శైలి గురించి వివరించారు.అల్లా ఆశీస్సులు మనఅందరిపై ఉంటాయని అన్నారు. భారతదేశం సెక్యూలరిజం కలిగిన దేశమని,అందరం కలిసికట్టుగా సోదరాభావంతో కలిసి మెలిసి జీవిస్తున్నామని అన్నారు. ప్రవక్త చూపించిన శాంతి, సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ర్యాలీకి సహకరించిన పోలీస్ అధికారులు సీఐ కృష్ణ, ఎస్ఐ సాయన్నను ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Eid Milad-un-Nabi celebrations