Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 7:06 pm Posted by : ramakrishna

వరి ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా కృషి చేయాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ధాన్యం సేకరణ తీరును నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. ఇదే మండలంలోని దోన్పాల్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సైతం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్లలో ఒకింత జాప్యం జరుగుతోందని, ట్రక్ షీట్ వివరాలు తమకు అందించడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, మోర్తాడ్ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జి దిలీప్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీసీఓను ఆదేశించారు.

 

Efforts should be made to expedite the procurement of paddy.

 

పూర్తి పారదర్శకంగా పని చేస్తూ రైతులు నష్టపోకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచనలు చేశారు. పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని, ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని, సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యాతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి, శుభ్రపరచి బాగా ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయన్న, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు.

Efforts should be made to expedite the procurement of paddy.