. . . ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్
. . . వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
. . .ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జాతీయ ఉద్యమ ఆకాంక్షలకు రాజ్యాంగానికి ఫెడరల్ సూత్రాలకు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్ (విబిఎస్ఎ)-2025 బిల్లు లోపాల పుట్ట అని ఈ విధానాల ద్వారా విద్య కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పోరేటీకరణ, వ్యాపారీకరణ చేస్తూ అంత్యంత ప్రమాదంలో విద్యారంగాన్ని నెట్టారని, వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోనెరెడ్డి కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అందరికీ విద్య పేరుతో కొందరికే (కొనగలిగే వారికే) విద్యను పరిమితం చేసిన ఘనత మన పాలకులదని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారత దేశంలో 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ అని, దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై నిరంతర విద్యార్థుల పక్షాన నిలుస్తూ ఉద్యమాలు చేస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని తెలిపారు. విద్య వ్యాపారీకరణ వలన ఎస్సి, ఎస్టి, బిసి, ఒబిసి, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరమయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీకి ఎలాంటి భరోసా ఇవ్వలేదని, ఈ విద్యా విధానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను, విదేశీ విశ్వవిద్యాలయాలను అనమతిస్తారన్నారని, మండలంలో, జిల్లాలో ఉన్న కళాశాలల ప్రవేశాలకు దేశమంతటికీ వర్తించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఒకే పరీక్ష జరుగుతుందని, దీని ద్వారా స్థానికత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో కనీసం 10 శాతం, జిడిపిలో 6 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని అనేక నివేదికలు చెబుతున్నా బడ్జెట్లో విద్యారంగం వాటా ఏ ఏటికాయేడు కుంచించుకుపోతూ 2.6 శాతంకు తగ్గడం కేంద్రానికి విద్యారంగం పట్ల ఉన్న వివక్షతకు అద్దం పడుతుందని, ఈ కేటాయింపుతో దేశంలో విద్యారంగం ఎలా బాగుపడుతుందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా బడ్జెట్ లో రాష్ట్ర విభజన సమస్యలపైనా ఎలాంటి ప్రకటన చేయలేదని, ఐఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్స్ స్కూల్ మంజూరు చేయాలని డిమాండ్ ఉన్న వాటి ఊసే లేదని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్ లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1800 కోట్లు రావాల్సి ఉన్న కేటాయింపు లేదని దుయ్యబట్టారు. తెలంగాణ నుండి 8మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్న తెలంగాణ విద్యార్థులకు కేంద్రం నుండి తీసుకు వచ్చిందేమీ లేదని మండిపడ్డారు. ఫిబ్రవరి 18,19,20వ తేదీల్లో మూడు రోజులపాటు నిజామాబాద్ పట్టణంలోని గోనెరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిసాయని తెలిపారు.ఈ మహాసభలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కౌన్సిల్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా రెహమాన్, గ్యార క్రాంతి, సోతుకు ప్రవీణ్, బాలసాని లెనిన్, సహాయ కార్యదర్శులుగా ఇటికాల రామకృష్ణ, బానోతు రఘురాం, గ్యార నరేష్, చిట్యాల రాజు, కోశాధికారిగా కాసోజు నాగజ్యోతిలతో పాటు నూతన కౌన్సిల్ సభ్యులుగా 69 మంది, ఆహ్వానితులుగా నలుగురు మొత్తం 73 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్, ఒమయ్య, ఎఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుభోద్, బానోతు రఘురాం, జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, జిల్లా కోశాధికారి అనూష, నాయకులు కిషోర్, రమేష్, దినేష్, రిహాన్ తదితరులు పాల్గొన్నారు.