. . . వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
విద్య ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్య వ్యాపారంగా మారిపోయిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే. అషూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ లు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కాకుండా వాటిని బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 25 శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షురాలు డి. దీపిక, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రఘురాం, ఏఐపీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. అనిల్, పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి వినోద్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, జిల్లా నాయకుడు కిషోర్, పీడీఎస్‌యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, జిల్లా నాయకులు మనోజ్, నగర నాయకులు గౌరవ్‌తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
