Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 7:35 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి

 

. . . ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారే

 

బోధన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకు విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని బీడీఎస్ఎఫ్ (భారత్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్) విద్యార్థి సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారే డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం బోధన్ పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయం ఎదుట బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్ తల్లారే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని, విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని కోరారు. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ప్రతి పాఠశాలలో ప్రాథమిక మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మధుమలాంచ ప్రభుత్వ పాఠశాల రాత్రి వేళల్లో ఆకతాయిల అడ్డాగా మారిందని, అక్కడ మద్యం సీసాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మించి, రాత్రి వేళల్లో భద్రత కల్పించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీడీఎస్ఎఫ్ నాయకులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేద, బహుజన విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపుకు సంబంధించిన విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. విద్యార్థులకు అందించాల్సిన 21 వస్తువుల కిట్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల ను ఆలస్యం లేకుండా పంపిణీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, అక్కడి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని బీడీఎస్ఎఫ్ నాయకులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి నరేందర్, జిల్లా నాయకులు రాజు, దీపక్, లాలూ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

 

Education Department officials must visit government schools at the field level.