. మెండోరా స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయన్న గ్రామస్తులు
. ధ్రువీకరించని నిజామాబాద్ జిల్లా అధికారులు
భీమ్ గల్, బతుకమ్మ : ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంగా ఏర్పడిన భూకంపం ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలపై పడింది. భూకంపం ప్రభావం కరీంనగర్ – నిజామాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో కూడా కనిపించింది. భీమ్ గల్ మండలం మెండోరా గ్రామంలో ఉదయం 7.27 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గ్రామంలోని పలువురు యువకులు దీన్ని ధ్రువీకరించారు. తాము ఇంట్లో ఉన్న సమయంలో భూమి కంపించినట్లు మాజీ ఎంపీటీసీ ఆరే లావణ్యారవీందర్ తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో భూకంపం ప్రభావంపై సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఏది ఏమైనా భూకంపం భయం ప్రజలను పట్టుకుంది. కాగా మన హైదరాబాద్ ప్రాంతం సెస్మిక్ జోన్-2లో ఉందని, జోన్ – 5లో ఉన్న ప్రాంతాల్లోనే భూకంపం ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రిక్టర్ స్కేలు పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంగా ఉదయం 7.27 గంటల ప్రాంతంలో భూకంపం ఏర్పడగా, మూడు నుంచి నాలుగు సెకండ్లపాటు భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. అయితే భూకంపం ప్రభావం ఖమ్మం భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలోని కోల్ బెల్ట్ ప్రాంతంలోనే కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా చాలా ఏళ్ల తర్వాత భూమి కనిపించడంతో జనం ఉలిక్కిపడ్డారు.