. మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల తీరుపై విమర్శలు
. నాయకుల సిఫారసు ఉన్న వారికి పెద్దపీఠ
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు ఆఫీసర్ ల విధుల కేటాయింపుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల సిఫార్సుల మేరకు కొందరు వార్డు ఆఫీసర్ లకు కోరుకున్న చోట విధులు కేటాయించిన సంబంధిత అధికారులు మిగతా వారికి తమకు ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు వేశారు. కోరుకున్న చోట పోస్టింగ్ లభించిన వారు డ్యూటీలు చేస్తుండగా, కార్పొరేషన్ అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు వేశారని, తాము విధులకు వెళ్లలేమని మిగతా వారు డిప్యూటీ కమిషనర్ తో బహిరంగంగానే వాదనకు దిగుతున్నారు. హిందీ రాని తమను మైనార్టీ ఏరియాలకు కేటాయించారని అంటున్నారు. మొత్తం 45 మందిలో నుంచి కొందరికి నేతలు సూచించిన చోట పోస్టింగ్ లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో డబ్బులు తీసుకుని కొందరిని సెక్షన్ లో నియమించారని అంటున్నారు. వార్డు ఆఫీసర్ లకు సెక్షన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 60 డివిజన్ లకుగాను 45 మందిని నియమించారని, కొందరికి రెండు వార్డుల చొప్పును కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నాయకులు, ఇటు వార్డు ఆఫీసర్ల ఒత్తిడిని తట్టుకోలేని కమిషనర్ దిలీప్ కుమార్ డిప్యూటీ కమిషనర్ కు వార్డు ఆఫీసర్ ల బాధ్యతలను అప్పగించి కమిషనర్ చేతులు ఎత్తేశారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు.