Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2024, 4:09 pm Posted by : ramakrishna

అటెండర్లకు ఉత్తుత్తి బదిలీలు

. బదిలీ అయినా యథాస్థానంలో విధులు

. ట్రాన్స్ ఫర్ అయిన చోట కాకుండా సొంతూర్లో విధులు నిర్వర్తిస్తున్న ఒకరు

. పాతస్థానాన్ని వీడని మరొకరు

. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు  

 నిజామాబాద్, బతుకమ్మ : విద్యుత్ శాఖలో బదిలీ బాగోతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల నుంచి పేరుకే ఆప్షన్లు తీసుకున్న అధికారులు తమకు నచ్చిన వారిని నచ్చిన చోటికి బదిలీ చేయించారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా  ఉండగా అటెండర్ల బదిలీల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు  చర్చనీయాంశమైంది.  అటెండర్లకు ఉత్తుత్తి బదిలీ చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండానే వారికి అటెండర్లకు వెసులుబాటు కల్పించడం వెనుక ఆంతర్యం బోధపడడం లేదు.

మోర్తాడ్ లో పని చేస్తున్న అటెండర్ ను నిజామాబాద్ ఎస్ ఈ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన  సదరు వ్యక్తి నిజామాబాద్ లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ఆర్మూర్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ ఎస్ ఈ కార్యాలయం లో పని చేస్తున్న అటెండర్  ఆర్మూర్ కు బదిలీ అయ్యాడు. ఆయన ఆర్మూర్ కు వెళ్లకుండా నిజామాబాద్ లోనే విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. దీనిపై పవర్ హౌస్ లో చర్చ జరుగుతోంది.

హాజరు ఎక్కడ..?

తమకు బదిలీ అయిన చోట విధులు నిర్వర్తించని అటెండర్లు హాజరు ఎక్కవ వేసుకుంటున్నారనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజూ విధులకు హాజరుకాగానే రిజిస్టర్ లో సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ వీరి సంతకాలను మాత్రం అధికారులు రహస్యంగా  ఉంచుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొరపాట్లకు తావులేకుండా బదిలీలు చేపట్టామని చెబుతున్న అధికారులే అటెండర్ల  వ్యవహారాన్ని దాచి ఉంచుతున్నారనే విమర్శలున్నాయి.  జీతాలకు బిల్లు పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి పెడతారో తెలుసుకునేందుకు మిగతా సిబ్బంది వేచి చూస్తున్నారు.

మహిళలకు

నిరుడు జరిగిన బదిలీల్లో మహిళలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లారు. అప్పట్లో వారు తమకు ఉన్న చోటే అవకాశం కల్పించాలని ప్రాధేయపడ్డారు. అయినా కనికరించని అధికారులు ఎక్కడ పోస్టింగ్ ఉంటే అక్కడ విధులు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సారి బదిలీల్లో ఇద్దరు మగాళ్లకు ఉన్న చోటనే ఉండేలా అవకాశం కల్పించడంతో మహిళా అటెండర్లు మండిపడుతున్నారు.