Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 7:17 pm Posted by : ramakrishna

మాదకద్రవ్యాల వినియోగంతో భవిష్యత్ మసక బారుతుంది

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ

 

నిజామాబాద్, బతుకమ్మ : మాదకద్రవ్యాల వినియోగం వలన మానవ జీవితపు నడక దారి తప్పు తుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భరత లక్ష్మీ అన్నారు. యువత బంగారు భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్ ను సేవించకుండా ఉండాలని ఆమె కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జూన్ 26 న జరుపుకోనున్న నేపథ్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన చాంబర్ లో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రూపొందించిన “జీవితంలో డ్రగ్స్ కు నో చెప్పడం ఎలా..?” అనే గోడ పోస్టర్ ను ఆమె సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి లతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదం మేరకు ప్రతి సంవత్సరం జూన్ 26 డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. 2025 సంవత్సరానికి గాను డ్రగ్స్ నివారణ, చికిత్స, న్యాయ వ్యవస్థ దృష్టి సారిస్తుంది అనే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.గోడ పోస్టర్ లను గోడలకు అతికించడం మూలంగా డ్రగ్స్ వినియోగ వ్యతిరేక ప్రచారం ప్రజా సమూహంలోకి బలంగా వెళుతుందని ఆమె అన్నారు. విద్యార్థులు, యువత, పౌరులు మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకోరాదని కోరారు.యువతరం దేశ అభివృద్ధికి, ప్రగతికి తమ మేధస్సుతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లాజడ్జి విన్నవించారు. డ్రగ్స్ అనే మత్తు మనిషి పురోగతికి పనికి రాదని అన్నారు.జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా డ్రగ్స్ వినియోగ వ్యతిరేక ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. సంస్థ ప్రచారానికి యువత, విద్యార్థులు, పౌరులు, పౌర సమాజం సహకారం అందించాలని ఆమె అభిలాషించారు. జూన్ 26 న జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్ లో విద్యార్థులు, యువత తో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ కట్టడికి పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.సమాజం పట్ల సామాజిక బాధ్యతగా న్యాయసేవ సంస్థ డ్రగ్స్ జనసామాన్యంలో వెళ్లకుండా నూతన ప్రచారశైలికి శ్రీకారం చుట్టుకున్నట్లు వివరించారు.