- రికార్డుల నమోదు సక్రమంగా లేకపోవడంపై మండిపడ్డ డిఆర్డిఓ
- పలువురు ఫీల్డ్ అసిస్టెంట్ లకు రూ. 20 వేలు ఫైన్
రుద్రూర్, బతుకమ్మ : గ్రామీణా ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధిహామీ పనులపై ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్ లు వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయకపోవడంపై డీఆర్డీఓ సాయాగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయంలో శనివారం నాలుగవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన డీఆర్డిఓ ఆయా గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులపై వాటికి సంబంధించిన నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు చేసిన పనుల వివరాలు, నాటిన మొక్కల వివరాలు రికార్డుల్లో సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆయన ఆరా తీశారు. విధుల పట్ల అలసత్వం వహించడంపై ఆయన మండిపడ్డారు. ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.20 వేలు ఫైన్ వేశారు. హరితహారంలో భాగంగా ఆయా గ్రామాల్లో నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఆయా గ్రామాల సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ భీంరావు, ఏవీఓ నారాయణ, ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.