Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 6:20 pm Posted by : ramakrishna

డ్రైనేజీ లు శుభ్రపరిచే పనులను వేగవంతం చేయాలి

 

. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ కాలువల శుభ్రపరిచే పనులను వేగవంతం చేయాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అధికారులకు సూచించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న పౌర సేవల నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మేయర్ శుక్రవారం 11, 40 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ వీధుల పరిశుభ్రత, చెత్త సేకరణ విధానం, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించిన మేయర్ ప్రజలకు నాణ్యమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మురుగునీటి పారుదల పరిస్థితులను కూడా పరిశీలించిన మేయర్ ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 

Drainage cleaning operations must be expedited.

 

రోడ్ల మరమ్మత్తు పనుల పురోగతిని సమీక్షించిన మేయర్ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యటనలో భాగంగా 11వ డివిజన్‌లోని జంతు వధశాలను సందర్శించిన మేయర్ అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులు, నిర్వహణ విధానం, పరిశుభ్రత ప్రమాణాల అమలును పరిశీలించారు. ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచిస్తూ, ఆరోగ్య భద్రతా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ముచ్చటించిన మేయర్ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు మెరుగైన పౌర సేవలందించడంలో నగర పాలక సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, భూమేశ్వర్, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

 

Drainage cleaning operations must be expedited.