- కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి, వృత్తి రీత్యా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్. వి. శంకర్ డా. సినారే అవార్డుకు ఎంపికవ్వడం హర్షనీయమని కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం, భువనగిరి జిల్లా పరిధిలోగల సాహిత్య సంస్థల సహకారంతో ఈనెల 27 న భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర (పాత వివేరా హోటల్ ఎదురుగా) గల ఎస్. ఎల్. ఎన్.ఎస్ డిగ్రీ, పీ.జీ కళాశాల ఆడిటోరియంలో ఉదయం 10:00 నుండి సినారె జయంతి ఉత్సవాల్ని నిర్వహించనున్న నేపత్యం లో ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి సభాధ్యక్షతన జరిగే ఈ సినారె 94 వ జయంత్యుత్సవాల్లో ఈ పురస్కారం కార్యక్రమ ముఖ్య అతిథి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ అమృత హస్తాలతో అందజేసే సినారె పురస్కారాన్ని డాక్టర్ వి. శంకర్ అందుకోనున్నారని ఆయన తెలిపారు. శంకర్ స్వస్థలం ఫరీదుపేట. నివాసం కామారెడ్డి. డాక్టర్ వి. శంకర్ కలం నుండి జాలువారిన ఫరీదుపేట – తెలంగాణ బతుకు చిత్రం, తెలంగాణ (డాక్యుమెంటరీ), సమైక్యవాదుల నూటా పదకొండు అబద్ధాలు, అపోహలు – అసలు నిజాలు, నిజామాబాద్ జిల్లా కవిత్వం మున్నగు గ్రంథాల్ని ఆయన రచించారని అన్నారు. వీరి విశిష్ట సాహిత్య సేవలకు మహాకవి డాక్టర్ సినారె సాహిత్య పురస్కారం లభించడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాహితీవేత్తలు, సాహిత్యకారులు, తెలంగాణ రచయితల సంఘానికి,కవి మిత్రులందరికి గర్వంగా ఉందని కంకణాల రాజేశ్వర్ వెల్లడించారు.ఈ సందర్బంగా అవార్డు అందుకోనున్న డా. శంకర్ కు కవి కంకణాల శుభాకాంక్షలు తెలిపారు.