వెబ్ డెస్క్, బతుకమ్మ :
కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) కన్నుమూశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజమహేంద్రవరంలోని ప్రసాదిత్య మాల్ సమీపంలో ఇటీవల జరిగిన వివాదం అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, తొలుత స్థానికంగా చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. కుటుంబంలో తొలి డాక్టర్‌గా నిలిచి, వైద్య రంగంలో సేవలందించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులు, సహచర వైద్యులు, స్నేహితుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
. . . అవయవదానానికి తల్లిదండ్రుల అంగీకారం
కుమార్తెను కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. తమ కుమార్తె మరణించినప్పటికీ, ఆమె అవయవాల ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ ప్రియాంక మృతితో వైద్య విద్యార్థులు, సహచరులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.