బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయకర్త డిసిహెచ్ఎస్ బాన్సువాడ ఏరియా ఆసుపత్రి, మాతా -శిశు ఆసుపత్రి ఎంసిహెచ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎం. శ్రీనివాస్ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో వైద్య సేవల ప్రస్తుత పరిస్థితి, ఆసుపత్రుల నిర్వహణ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్‌తో చర్చించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదల, వైద్య సిబ్బంది సేవల సమర్థ వినియోగం, మాతా-శిశు ఆరోగ్య సేవల బలోపేతం, ప్రజారోగ్య కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ప్రభుత్వ వైద్య సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ, ప్రజలకు సత్వర వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని డాక్టర్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణలో పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు సమాచారం.