- రుణమాఫీ చేయిస్తానని రూ.90 లక్షలకు వరకు మోసం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆసుపత్రులను విస్తరించేందుకు, నిర్మించేందుకు తీసుకునే అప్పులనే టార్గెట్ చేసిన ఓ కేటుగాడు వారి రుణాన్ని మాఫీ చేయిస్తానని నమ్మబలికి మోసం చేశాడు. తనకు పెద్దలతో సంబంధాలున్నాయని, రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మించి ముంచేసిన ఘటన పోలీసులు అరెస్టు చేయడంతో వెలుగు చూసింది. నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి కథనం ప్రకారం నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడికి చెందిన ప్రముఖ వైద్యుడికి హైదరాబాద్ లోని ఖుత్భుల్లాపూర్ లోని కే.వి.రంగారెడ్డినగర్ కు చెందిన బంగారు అప్పారావు రూ.15 లక్షలు తీసుకుని వైద్యుడు తీసుకున్న రూ.50 లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని నమ్మబలికాడు. ఈ విషయంలో తనకు పెద్దలు తెలుసునని సెటిల్ మెంట్ చేస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మొఖం చాటేశాడు. అలాగే కోరుట్ల కు చెందిన డాక్టర్ వద్ద లోన్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పి దాదాపుగా 60 లక్షల వరకు తీసుకున్నాడు. జిల్లాలోని మోర్తాడ్ కి చెందిన డాక్టర్ వద్ద కూడా లోన్ సెటిల్మెంట్ చేస్తానని రూ.12 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఇతను ఇవే కాకుండా చాలామంది దగ్గర లోన్ సెటిల్మెంట్ చేస్తానని ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకున్నట్లు తెలిసింది. డాక్టర్ల వద్ద మోసంతో తీసుకున్న డబ్బులను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం, అప్పులు ఇవ్వడం అతని నైజమని అన్నారు. అప్పారావును అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.