Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2024, 4:24 pm Posted by : ramakrishna

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలి

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్, రాజీవ్ నగర్ కాలనీలో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ… రుద్రూర్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి, నిరుపేదలకు పంపిణీ చేయకుండా చేసిందన్నారు. బాన్సువాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యపై నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేటికీ అధికారులు లబ్ధిదారుల జాబితా తయారు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి, ఇండ్లను స్వాధీన పరుచుకున్న సంఘటన గుర్తు చేశారు. అధికారులలో మళ్లీ అదే నిర్లక్ష్య ధోరణి కనబడుతుందని నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల లోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయకపోతే పేద ప్రజలే స్వాధీన పరుచుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి లక్ష్మణ్, నాయకులు భీమయ్య, గంగాధర్, అప్సర్ ఖాన్, సాయిలు, హన్మవ్వ, తదితరులు పాల్గొన్నారు.