- ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
- వామపక్ష విద్యార్థి సంఘాల ర్యాలీలో ప్రభుత్వానికి హెచ్చరిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్‌లో పెద్ద ఎత్తున విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బోడ అనిల్ మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మేమూలు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు కడితే గాని సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు దిన్ని వల్ల వారు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇది చాలా విషాదకరం” అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోందన్నారు. అసెంబ్లీలో విద్యారంగంపై చర్చ లేకుండా కాలయాపన చేయడం, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మర్చిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.”బడ్జెట్ లేదంటూ ప్రభుత్వ నేతలు చెప్పడం సరికాదు. మీ ఎమ్మెల్యేలు, మంత్రుల కాన్వాయ్‌లకు జీతాలకు డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇతర సంక్షేమ పథకాల బడ్జెట్‌లోంచి కొంత భాగాన్ని విద్యార్థుల కోసం కేటాయిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు రూ.150 కోట్లు బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కీం ద్వారా చేరిన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయకుండా అసెంబ్లీలో చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలి, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన మెనూ అమలుకు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే జూలై 23న జరగనున్న విద్యాసంస్థల బంద్ ద్వారా విద్యార్థుల శక్తిని చూపించడమే మాకున్న మార్గమవుతుంది” అని బోడ అనిల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ.విగ్నేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి కర్క గణేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐఎఫ్ఢీఎస్ జాతీయ కన్వీనర్ బేకరీ రాజశేఖర్, ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు నాగరాజు, పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సతీష్, ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్ పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దినేష్ ఇతర నాయకులు సాయి కృష్ణ, సృజన్, శివ, గణేష్, యశ్వంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.