- పోలీస్ స్టేషన్ లలో అనధికార రూల్స్
- కత్తితో పొడిచిన కేసుల్లో తారుమారు
- జిల్లా కేంద్రంలో పోలీసుల కొత్త రూల్స్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దారుగల్లిలో ఏప్రిల్ 25న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని యజమాని చేపడుతుండగా పొరుగింటి వారు అడ్డుకున్నారు. అదివరకే అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించవద్దని ధమ్ కీ ఇచ్చినా వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. అయినప్పటికీ రెచ్చిపోయిన వారు కాంపౌండ్ వాల్ నిర్మాణం అడ్డుకునేందుకు కత్తులు, పంచ్ లతో దాడులకు తెగబడ్డారు. ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యులు కూడా నిర్ధారించారు. పోలీసులు మాత్రం సాధారణ తగాదాగా సెక్షన్లను మార్చి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరంలో అధికార పార్టీ లీడర్లు జోక్యం చేసుకున్నారని కొందరు దళారులు కేసును తారుమారు చేసేందుకు యత్నాలు జోరుగా సాగుతున్నాయి.
నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ నయా బ్రిడ్జి వద్ద మార్చి నెలలో యువకుడిపై కొందరు రౌడిషీటర్లు దాడి చేశారు. అంతకుముందే అదే యువకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం విశేషం. తమపైనే యువకుడు కత్తులతో దాడి చేశారని సీన్ క్రియేషన్ చేశారు. వ్యక్తిగతంగా వారే బ్లేడ్ తో కోసుకుని తమపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో సంబంధిత యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై హత్య కేసుతో పాటు రౌడిషీట్ లు ఉండడం గమనార్హం.
నిజామాబాద్ నగరంలో కత్తులు అనేవి సర్వసాధారణమైనాయి. 14 ఏళ్ళ బాలురు మొదలుకుని 30 ఏళ్ళ యువకుల వరకు కత్తులు (బాడ్) కలిగి ఉండడం ఫ్యాషన్ అయింది. సోషల్ మీడియాలో కత్తులు, కటారులు, తల్వారులు, పంచ్ లతో ఫోటోలో పెట్టడం ట్రెండింగ్ గా మారింది. నిజామాబాద్ నగరంలో కత్తులు కలిగి ఉన్న వారి సంఖ్య వేలల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో కొందరు రౌడియిజం, బెదిరింపులు, గుండాయిజం కోసం కత్తులు, కటారులతో దాడులు చేయడంతో పలు స్టేషన్ లలో వారిపై షీట్లు ఉన్నాయి. అయితే వారిని కొందరు తమ అవసరాల కోసం ఇతరులపైకి ఉసిగొల్పి దాడులు చేయిస్తూ దందాలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో రౌడిషీటర్లు ఏదో ఒక పార్టీ నాయకుడి అనుచరులుగానే చెలామణి అవుతూ సివిల్ సెటిల్ మెంట్లు, భూ పంచాయితీలు చేస్తున్నారు. గతంలో కలప స్మగ్లింగ్ తర్వాత గంజాయి దందా, మొన్నటి వరకు పీడీఎస్ రీసైక్లింగ్ దందాలో రౌడిషీటర్లదే హవా. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ లలో సెటిల్ మెంట్ లు ప్రమాణికంగా మారాయి. మొన్నటి వరకు కత్తులతో బహిరంగంగా దాడులు జరిగినా చర్యలు తీసుకోలేదు. కొత్తగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆపరేషన్ టప్పా చభూత్రతో పాటు ఫుట్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీ, రాత్రివేళ సంచారాన్ని నిరోధించారు. ఈ నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులకు తెగబడుతున్నారు. అయితే పోలీస్ స్టేషన్ లలో మాత్రం కేసులు తారుమారవుతున్నాయి. ప్రధానంగా కత్తులతో దాడులు అనగానే పోలీసు అధికారులే నిరోధిస్తున్నారు. వాటిని సాధారణ దాడులుగానే కేసులు నమోదు చేయడం, తమకు అనుకూలంగా ఉన్న వారు పైరవీకారులు చెబితే సెక్షన్లు మార్చివేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.