Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 March 2025, 9:57 pm Posted by : ramakrishna

ఆన్ లైన్ బెట్టింగ్ కు బలి కావద్దు

  • పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతకమ్మ : యువత ఆన్ లైన్ బెట్టింగ్ మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఒక కుటుంబాన్ని బలి తీసుకుందని, ఇలా ఇంకెవరూ జీవితన్ని కోల్పోవద్దని అన్నారు. ఇందుకు వడ్డేపల్లి గ్రామంలో జరిగిన సంఘటనే ఉదాహరణ అని తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసైన ఒక యువకుడు  తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆ యువకుడు ఈజీ మనీ వస్తుందనే ఆశతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టడం మొదలు పెట్టాడని, కానీ నష్టపోయి కుటుంబంపై అప్పు భారం పెంచాడని తెలిపారు. తన స్థలాలను అమ్ముకున్నా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. చివరికి ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక బాధతో తన తల్లిదండ్రులతో పాటు తాను ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రారంభంలో ఈ కేసును అన్ న్యాచురల్ డెత్ డ్యూ టూ ఫైనాన్సియల్ స్ట్రెస్ గా నమోదు చేశారని,. కానీ నిజంగా ఇది ఒక వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. ఇది ఒక సామాజిక ప్రమాదం – ఫేక్ ప్రోమోషన్లతో మన యువతను మోసం చేస్తూ, పాడైపోయే దారి చూపించే బెట్టింగ్ యాప్‌ల దౌర్జన్యం అని పేర్కొన్నారు. ఈ విషాద ఘటన పట్ల సీరియస్‌గా స్పందించిన నిజామాబాద్ పోలీస్ శాఖ, కేసును తిరిగి పరిశీలించి, అసలు కారణాలపై దర్యాప్తు జరిపిందన్నారు. దర్యాప్తులో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోందని, ఈ టైంలో బెట్టింగ్ యాప్‌లు మరింత ఆకర్షణీయంగా, యువతను లక్ష్యంగా చేసుకుంటూ ప్రచారం చేయడం మొదలుపెడతాయని తెలిపారు.  జాగ్రత్తగా ఉండాలని, అలర్ట్ గా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ఎవరు ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు లింక్స్ షేర్ చేస్తున్నారు అన్నదానిపై తాము సైబర్ మానిటరింగ్ చేస్తున్నామని  తెలిపారు.