Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:47 pm Posted by : ramakrishna

తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేయొద్దు

 

. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

రైతులందరికీ న్యాయం జరిగే వరకు, ధాన్యం చివరి గింజ కొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి సెంటర్ లో రైతులు పడుతున్న అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు కేవలం మూడు లారీలు మాత్రమే పంపడంపై అధికారులను నిలదీశారు. 75 మంది రైతులు ఉండగా కేవలం 25 మందికి మాత్రమే టోకెన్లు రావడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ చెప్పిన విధంగా ఒక్క బస్తాకి 41.5 కిలోల కంటే ఒక్క గ్రాము కూడా అదనంగా తీసుకోకూడదని కానీ రైస్ మిల్లర్లు ఒక్క బస్తాకి 44 కిలోలు తీసుకుంటున్నారని, ఈ చొప్పున తీసుకుంటే క్వింటల్ కి 8 కిలోలు రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో రైతులను వేధించే మిల్లులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి రైతుల బాధలు చూడాలని సూచించారు. నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆయన జిల్లా డి ఎస్ వో తో ఫోన్‌లో మాట్లాడారు. ఇతర సెంటర్లు క్లోజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడి వాహనాలను తక్షణమే మళ్లించాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.