. . . బ్యాంకు ఉద్యోగుల డిమాండ్
. . . కొనసాగుతున్న నిరసనలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కేంద్ర ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ఉద్యోగ భద్రత, పెన్షన్ హక్కులు, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నూతన పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్) ఉద్యోగుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతోందని పేర్కొంటూ పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం, సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సంఘ నాయకులు తెలిపారు. కార్పొరేట్ రుణాల విషయంలో యాజమాన్యాలు సడలింపులు ఇస్తుండగా, సాధారణ సిబ్బందిపై మాత్రం పనిభారం పెంచుతున్నారని విమర్శించారు. ఉద్యోగులకు తగిన వేతనాలు, పదవీ విరమణ అనంతర భద్రత కల్పించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆరోగ్య భద్రతా పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా రంగ బ్యాంకులను బలోపేతం చేయడమే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించే విధానాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ, పీఎఫ్‌ఆర్‌డీఏను కోరారు. నిరసన కార్యక్రమంలో కామ్రేడ్ రమేష్, గురునాథ్, శ్రీనివాస్, సునంద, ప్రమోద్, సుధాకర్, సుప్రీం తదితర ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.