Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 6:27 pm Posted by : ramakrishna

కమర్షియల్ అవసరాలకు గృహ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు

  • ఇష్టారాజ్యంగా సబ్సిడీ సిలిండర్ల వ్యాపారం

 

బాన్సువాడ, బతుకమ్మ  :  హోటల్లు, టిఫిన్ సెంటర్లు,రెస్టారెంట్లు,కర్రీ పాయింట్,పర్మిట్ రూములు ఇలా మొదలుకొని ప్రతి ఒక్క షాపులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాలి కానీ గ్యాస్ ఏజెన్సీలు అధిక డబ్బుకు ఆశపడి హోటళ్లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలకు గృహ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో బాన్సువాడ పట్టణంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ జోరుగా సాగుతుంది.రోజుకు వందల సిలిండర్లు బ్లాక్ లో అమ్ముకొని గ్యాస్ ఏజెన్సీలు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని తెలుస్తుంది.బాన్సువాడ పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పట్టణంలోని మూడు ఏజెన్సీల ద్వారా మూడు కంపెనీ (హెచ్ పి, ఇండియన్,భారత్) ల గ్యాస్ రవాణా జరుగుతుంది.పట్టణంలో సుమారు టిఫిన్ సెంటర్లు,హోటల్లు,కర్రీ పాయింట్లకు వారంలో రెండు పైగా సిలిండర్ల అవసరం ఉంటుంది.కమర్షియల్ సిలిండర్ 19 కేజీలకు రూ.1856 కాగా సబ్సిడీ సిలిండర్ 15 కేజీలకు రూ.905 కు లభిస్తుంది.ఒక కమర్షియల్ సిలిండర్ బదులుగా రెండు సబ్సిడీ సిలిండర్లు వస్తుండడంతో హోటల్ యాజమాన్యాలు సబ్సిడీ సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది అదునుగా భావించిన గ్యాస్ ఏజెన్సీలు ఒక్కో సిలిండర్ కు రూ.200 నుంచి రూ.300 మేర అధికంగా వసూలు చేసి కమర్షియల్ సిలిండర్లు వాడాల్సిన చోట సబ్సిడీ సిలిండర్లను అందజేస్తున్నారు.దీంతో రోజువారీగా గ్యాస్ ఏజెన్సీలు లక్షల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు.గ్యాస్ బుక్ చేసుకున్న వారికి రెండు రోజుల్లో సిలిండర్ అందించాల్సి ఉంటుంది.కానీ, బ్లాక్ లో అమ్ముకోవడానికి అలవాటు పడిన ఏజెన్సీలు 3,4 రోజులపాటు గ్యాస్ ను అందించడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.డోర్ డెలివరీ ఇచ్చే సిలిండర్ కు రూ.905 తీసుకోవాల్సి ఉండగా 935 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు విచ్చలవిడిగా వినియోగిస్తున్న సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ దందాను జోరుగా నిర్వహించే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను సరఫరా చేయడానికి వినియోగిస్తున్న వాహనాలకు గ్యాస్ ఏజెన్సీ పేరు లేకుండా నడుపుతుండడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Domestic subsidized gas cylinders for commercial purposes