Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 3:34 pm Posted by : ramakrishna

కుక్కలు బాబోయ్..

  • భయాందోళనలో స్థానికులు
  • బెంబేలెత్తుతున్న చిన్నారులు, వృద్ధులు
  •  పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు

 

బాన్సువాడ, బతుకమ్మ  :  ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటూ బాబోయ్‌.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు బాన్సువాడ మున్సిపాలిటీలో చోటుచేసుకుంటున్నాయి.బాన్సువాడ మున్సిపాలిటీ లోని ఏ వార్డులో చూసినా కుక్కల గుంపు కనబడుతోంది.కాలనీలో ఒంటిరిగా వెళ్లాలంటేనే కాలనీవాసులు జంకుతున్నారు.ఉదయం వేళ స్కూల్‌ బస్సులకు కోసం కాలనీల్లో విద్యార్థులు వేచి ఉంటున్న సందర్భంలో కుక్కల గుంపును చూసిన విద్యార్థులు భయపడుతున్నారు. మదీనా కాలనీ నుంచి డైలీ మార్కెట్ వెళ్లే దారిలో టీచర్ కాలనీలోకి వెళ్లే దారిలో మంగళవారం రాత్రి పది కుక్కలున్న గుంపు ఓ ద్విచక్రవాహన చోదకుడిపైకి వచ్చాయి. చాకచక్యంగా అతడు తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పట్టణంలోని బండ గల్లీలో సైతం గుంపులు, గుంపులుగా ఉన్న కుక్కలతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. గుంపుగా ఉన్న కుక్కలు ఓ పాదచారుడిపై దాడికి ప్రయత్నించగా స్థానికులు బెదిరించడంతో అవి పారిపోయాయి. మునిసిపాలిటీ పరిధిలో ఇలాంటి పరిస్థితి పలు కాలోనిల్లో నెలకొందని, కుక్కల బారి నుంచి రక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు.