Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 10:28 pm Posted by : ramakrishna

రోడ్డుపై దందా చేసుకోవాలా.. కప్పం కట్టాల్సిందే..

  • తోపుడు బండ్ల వద్ద నెలవారీ వసూళ్లు
  • జిల్లా కేంద్రంలో లీడర్ల వసూళ్ల దందా
  • రెడ్ జోన్లో తోపుడు పండ్ల దందాలో ఖాకీలకు మామూళ్లా..?

 

నిజామాబాద్, బతుకమ్మ:

వందేళ్ల చరిత్ర కలిగిన ఇందూర్ నగరం బలవంతపు వసూళ్లకు అడ్డగా మారింది. 1970-80 దశకంలో మాదిరిగా ఆనాడు హప్తా వసూళ్లు జరిగితే ఇప్పుడు నెలవారి మాముళ్లు షరా మాములుగా అయ్యాయి. ఆనాడు రౌడీయిజం, గుండాయిజంతో బలవంతపు వసూళ్లు జరిగితే నేడు ప్రభుత్వం నిర్మించిన రోడ్లపై తమ ఏరియాలో దందాలు చేసుకుంటున్నారని బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయి. వసూళ్లు చేస్తున్నవారు స్థానిక మైనార్టీ లీడర్లే కావడం గమనార్హం. రెక్కాడితే డొక్కాడని పేదలు రోజువారీ కూలి గిట్టుబాటు కావడం లేదని తోపుడు బండ్ల పై పండ్లు, పూలు, కూరగాయలు, మసాలాలు, ప్లాస్టిక్ సామాగ్రీ, కిరాణా జనరల్ ఐటమ్స్ తో పాటు గాజులు అమ్ముకున్న, చివరకు బట్టలు అమ్ముకున్న వదలకుండా వారి వద్ద  దందాల పేరిట నెల వారీ వసూళ్లు చేస్తున్నారు లీడర్లు. అందుకు కారణం ఏమిటంటే నిజామాబాద్ నగర నడిబొడ్డున అత్యంత ట్రాఫిక్ కలిగిన ప్రాంతంలో దందా చేసుకునేందుకు మేమే చూసుకుంటాం అని అక్కడ ఇతరులకు అమ్మకాలకు అనుమతివ్వం అనే ఒప్పందం మేరకు తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారి వద్ద వసూళ్లు చేస్తున్నారు.

నిజామాబాద్ పట్టణంగా ఏర్పడి 80 వసంతాలు పూర్తయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (నగరం) గా రూపాంతంరం చెంది రెండు దశాబ్దాలు గడిచాయి. కానీ నిజామాబాద్ కు 1973 లో తెచ్చిన మాస్టర్ ప్లాన్ మినహ కొత్తది లేకపోవడంతో ఈ నగరం మున్సిపాల్టీకి ఎక్కువ.. కార్పోరేషన్ కు తక్కువ అనే చందంగా మారింది. హైద్రాబాద్, వరంగల్ తరువాత అత్యంత జనసామార్థ్యం కలిగిన నగరం మాస్టర్ ప్లాన్ లేక అనుమతులు లేని కట్టడాలతో నగర రోడ్లు కుచించుకుపోయాయి. దాదాపు ఏడు సంవత్సరాలక్రితం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ట్రాఫిక్ తిప్పలు తప్పించడానికి గ్రీన్ జోన్, రెడ్ జోన్ లాంటి పేర్లతో ఆనాడు పార్కింగ్ స్థలాలను నిర్ణయించినా వాటిని ఆచరణలో పెట్టడంలో ఆనాటి నుంచి పాలకులు విఫలం అయ్యారు. ఆనాడు బల్ధియా చేసిన నియమ నిబంధనలను అడ్డుపెట్టుకొని మాలపల్లి నుంచి మొదలుకొని బోధన్ రోడ్, బోధన్ బస్టాండ్, అహ్మది బజార్, శంభుని గుడి, నెహ్రూపార్క్, అంబర్ పేట్ చౌరస్తా నుంచి దేవి రోడ్ చౌరస్తాల వద్ద తోపుడు బండ్లను రెడ్ జోన్ లో నిలిపి దందాలు చేస్తున్నారని వసూళ్లకు తెరలేపారు కొందరు స్థానిక లీడర్లు. ఆనాడు నెలకు ఐదు వందల చొప్పున వసూళ్లు చేసిన లీడర్లు నేడు ఒక్కొక్క తోపుడు బండికి రూ10 వేల నుంచి 15 వేల వరకు వసూళ్లకు బరితెగించారు. అక్కడ దందాలు చేసుకునేవారికి విద్యుత్  కనెక్షన్ తో పాటు అడ్డాలను వారి పేర్లకు దారాదత్తం చేయడంతో రోడ్డులకు ఇరువైపుల ట్రాఫిక్ జాం అవుతున్న తోపుడు బండ్లలో దందా జరుగుతున్న తోపుడు బండ్లను ఒక్క అడుగు కూడా జరుపకుండా దందా చేస్తున్నారంటే ట్రాఫిక్ జాం ఏ పరిస్థితిలో ఉందోచెప్పకనే చెబుతుంది..

నిజామాబాద్ నగర నడిబొడ్డున జరుగుతున్న తోపుడు బండ్ల నుంచి వసూళ్ళ దందాలోచోటా, మోటా లీడర్లు ఆరితేరిపోయారు. వారు తమ ప్రాంతాలలో దందాలు చేసుకోవాలంటే తమకు కప్పం కట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. రంజాన్ మాసంలో తోపుడు బండ్లకు ఒక్కదానికి రోజుకు వేయి నుంచి రెండు వేలు వసూలు చేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉండగా ఇప్పుడు తోపుడు బండ్లతో పాటు టేలాలు (కోకాలలో) దందాలు చేస్తున్న వారు కుడా లీడర్లకు మామూళ్లు ఇస్తేనే దందా అనే పరిస్థితి నెలకొంది. ఇందులో కొందరు మాజీ కార్పోరేటర్లతో పాటు రౌడీషీటర్లు, మైనార్టీ లీడర్లు ఉన్నారు. నగరంలో ట్రాఫిక్ జాంకు కారణమైన తోపుడు బండ్లను నడిరోడ్డుకు తీసుకువచ్చి క్రయ విక్రయాలు చేస్తుంటే వారిని మందలించిన వారు కాని, కనీసం జరిమాన విధించిన వారు లేరు. సాయంత్రం అయిందంటే పరిస్థితి దారుణంగా ఉన్న ఇప్పటి వరకు అక్కడ తోపుడు బండ్ల వ్యాపారులను అక్కడి నుంచి బండి తొలిగించాలని చెప్పరంటే అతిశయోక్తి కాదు. ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారిన తోపుడు బండ్లను జనసమ్మర్థం కలిగిన ప్రాంతం నుంచి తరలించకుండా ఉండేందుకు సంబధిత డిపార్ట్ మెంట్ కు నెలవారి మాముళ్లు ఉన్నట్లు బండ్ల వ్యాపారులు బహిరంగంగా చెబుతున్నారు. లీడర్లు వారు చేసే వసూళ్ల నుంచే అమ్యామ్యాలను సమర్పిస్తారని అందుకే స్థానికంగా జిల్లా కేంద్రం నడిబోడ్డున ట్రాఫిక్ సిగ్నల్ లేవంటే అందుకు తోపుడు పండ్ల దందానే కారణం అంటున్నారు స్థానికులు. తోపుడు బండ్లతో దందా ప్రారంభమై, కోకాలకు తరువాత శాశ్వత నిర్మాణాలకు కారణమౌతున్న బల్ధియా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడరు. అక్కడ మాముళ్లు ఇచ్చి దందాలు చేసుకుంటున్నవారు ఎవ్వరు కుడా అక్కడి నుంచి కదపాలంటే పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసే పరిస్థితి దాపురించింది.