. . . విద్యార్థులకు టీజీవీపీ పిలుపు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
శ్రీ సాయి బి.ఎడ్ కళాశాలలో విద్యార్థుల నుంచి “అటెండెన్స్ ఫీజు” పేరుతో అక్రమంగా రుసుములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే టీజీవీపీ నాయకులు కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. అయితే, ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా స్పందిస్తూ “మేము ఫీజు వసూలు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అని వ్యాఖ్యానించినట్లు టీజీవీపీ నాయకులు తెలిపారు. దీంతో వెంటనే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ (వీసీ)కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీసీ స్పందిస్తూ, కళాశాలల్లో ఎలాంటి అటెండెన్స్ ఫీజులు వసూలు చేయడానికి నిబంధనలు లేవని స్పష్టం చేసినట్లు టీజీవీపీ నాయకులు వెల్లడించారు. అంతేకాకుండా, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో నేరుగా మాట్లాడి విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయవద్దని ఆదేశించినట్లు తెలిపారు. అయితే, వీసీ ఆదేశాల అనంతరం కూడా కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తోందని టీజీవీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ కూడా అటెండెన్స్ ఫీజు పేరుతో ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని టీజీవీపీ స్పష్టంగా పిలుపునిచ్చింది. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం, ఒకవేళ విద్యార్థులకు హాజరు శాతం తక్కువగా ఉంటే, అందుకు గల కారణాలను వివరిస్తూ విశ్వవిద్యాలయానికి లేఖ సమర్పిస్తే పరిశీలించి నేరుగా అనుమతి మంజూరు చేస్తారని, కళాశాలకు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని టీజీవీపీ పేర్కొంది. అలాగే కళాశాల యాజమాన్యం ఎవరైనా విద్యార్థులపై బలవంతంగా ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే టీజీవీపీ నాయకులను సంప్రదించాలని సూచించింది. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం టీజీవీపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, అక్రమ వసూళ్లు కొనసాగితే కళాశాల ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు సుజిత్, వినయ్, కెల్విన్, సూరజ్, నైతిక్, గౌతమ్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.