Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 5:29 pm Posted by : ramakrishna

ఏబీజీ – రామ్‌జీ చట్టాన్ని అమలు చేయొద్దు

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ, ఏబీజీ – రామ్‌జీ చట్టాన్ని అమలు చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఏ ఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి ఏబీజీ – రామ్‌జీ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించడం వల్ల గ్రామీణ కూలీల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను విరమించుకోవాలని కోరారు. కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో తన వాటాను తగ్గిస్తోందని, మిగిలిన భారం రాష్ట్రాలపై పడుతుందని తెలిపారు. వ్యవసాయ సీజన్‌లో ఉపాధి పనులకు పరిమితులు విధించడం, కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం, పని ప్రదేశంలో ఫొటోలు అప్‌లోడ్ చేసినప్పుడే వేతనాలు చెల్లించడం వంటి నిబంధనలు కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. గ్రామపంచాయతీల పాత్రను తగ్గించడం, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీజీ – రామ్‌జీ చట్టాన్ని అమలు చేయకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రం పంపించారు. వినతిపత్రం అందజేసిన వారిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు,   రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దొడ్ల  మోహన్ తదితరులు పాల్గొన్నారు.