బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : ప్రస్తుత రబీ సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి సంస్థకు అప్ప జెప్పకుండా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోనే కొనసాగించాలని మండలంలోని గోపాల్ పేట్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. గోపాల్ పేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాల్ తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోనే కొనసాగించాలని, ఐకెపి సంస్థకు అప్పచెప్పవద్దని కోరుతూ బుధవారం తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల మహిళా సమాఖ్య ద్వారా కొనుగోలు చేస్తే ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతాయని, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, దీంతో రైతులు నష్టపోతారని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ పరిధిలోనే కొనసాగించాలని, రైతుల బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మహమ్మద్ ఫరీద్, వంశీకృష్ణ గౌడ్, మచ్చేందర్ గౌడ్, బడిగే సాయిలు, క్రిస్టఫర్, కమ్మరి రవి, చాకలి సాయిలు, రాములు తదితరులున్నారు.