Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:06 pm Posted by : ramakrishna

పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

 

. . . గర్భిణీల నమోదు, మాతా-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని సీతారాం నగర్ కాలనీలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న సేవలు, రికార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రతి మంగళవారం నిర్వహించే “ఆరోగ్య మహిళా” కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీల నమోదును గర్భధారణ 12 వారాల లోపు పూర్తి చేయాలని, ప్రతి గర్భిణీ కనీసం నాలుగు సార్లు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గర్భిణీలకు రక్తహీనత, పోషకాహారం, ప్రమాదకర లక్షణాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాద సూచనలు ఉన్న గర్భిణీలను ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలని సూచించారు. రెండో లేదా అంతకంటే ఎక్కువ సార్లు గర్భం దాల్చిన మహిళలకు తాత్కాలిక, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించి, పిల్లల మధ్య కనీసం మూడు సంవత్సరాల వ్యవధి ఉండేలా చైతన్యం కల్పించాలని అన్నారు. ప్రసవం జరిగిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించాలని, జాతీయ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం టీకాలు సమయానికి వేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ వంటి ప్రజారోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ఎండలో పని చేసే కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తగినంతగా నిల్వ ఉంచాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, మందుల స్టాక్ రిజిస్టర్ తదితర రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపకేంద్రాల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను శాతం వందకు పూర్తి చేయాలని సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు అక్కడి సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ తనిఖీలో ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష, పీహెచ్ఎన్ ప్రమీల రాణి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

 

DMHO conducts surprise inspection of urban health center