Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 7:42 pm Posted by : ramakrishna

జీజీహెచ్ ను సందర్శించిన డీఎంఈ

  • సౌకర్యాల కల్పనపై కలెక్టర్ తో చర్చించిన అధికారులు
  • ఆసుపత్రిని క్షేత్రస్థాయిలో సందర్శించాలని ఆదేశించిన వైద్యారోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని డీ.ఎం.ఈ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం గురువారం సందర్శించింది.  డీఎంఈతో పాటు రాష్ట్ర ఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ దేవేందర్ ఇతర అధికారులు ఆసుపత్రికి చేరుకుని నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలను, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన మరమ్మతు పనుల గురించి  క్షేత్ర పర్యటనలో ఉన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో గూగుల్ మీట్ ద్వారా సంప్రదించి చర్చించారు. నిజామాబాద్ జీజీహెచ్ పనితీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ

DME visits GGH

సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీలు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన సందర్భంగా వారి ఆదేశాల మేరకు డీ.ఎం.ఈ నేతృత్వంలోని బృందం జీజీహెచ్ ను సందర్శించిందని అధికారులు వెల్లడించారు. సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గిపోవడం, మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతూ ఆయా విభాగాలకు ప్రత్యేక వైద్య నిపుణులు ఉన్నప్పటికీ పలు అత్యవసర కేసులను హైదరాబాద్ లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు పంపిస్తుండడం వంటి లోటుపాట్లను ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డీ.ఎం.ఈ ఇతర అధికారుల దృష్టికి తెచ్చారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చేందుకు, అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వ సలహాదారు సమీక్షలో ప్రస్తావిస్తూ ప్రత్యేక చొరవ చూపారు. వీరి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారుల బృందం గురువారం జీజీహెచ్ లో వివిధ విభాగాలను సందర్శించి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. మరమ్మతు పనుల కోసం మంజూరైన నిధులు, వాటిని వెచ్చిస్తూ చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ పనుల గురించి కూడా వివరాలు సేకరించారు. ఇంకనూ ఆయా విభాగాలలో ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉన్న వాటి గురించి, ఆసుపత్రి నిర్వహణను మరింతగా మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ తో చర్చించారు.

DME visits GGH