Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 12:12 am Posted by : ramakrishna

కాలయాపనలో డిచ్ పల్లి డివిజన్  

  • సిబ్బందితో దాగుడుమూతలు  
  • విభజన ఇష్టం లేకనే…!
  • తప్పుల తడకల జాబితా 
  • సర్కిల్ లో ఆ ఇద్దరి వల్లే అడ్డు  

నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ శాఖలో డిచ్ పల్లి డివిజన్ ను  విభజించడం వారికి ఇష్టం లేనట్లుగా ఉంది. అందుకేనేమో రెండేళ్లుగా ఆ ప్రక్రియను  కొనసాగింపజేస్తున్నారు. సర్కిల్ అధికారికి మరో అధికారి తోడై గంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఓఅండ్ఎం సిబ్బందితో దాగుడు మూతలు అడుతున్నారు. దీనివల్ల కాలయాపన చేస్తూ కావాలనే డిచ్ పల్లి డివిజన్ ను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కాంపౌండ్ లో వినిపిస్తున్నాయి.  6వ తేదీన వెల్లడించిన జాబితాను చూస్తేనే..  విభజన పట్ల సర్కిల్ వారికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతుందని ఓఅండ్ఎం సిబ్బంది తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే పవర్ హౌస్ లో టెంట్ వేసి ఆందోళన చేయడానికి  సంఘాలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. విభజన కోసం డివిజన్ ప్రజానికంతోపాటు ప్రజాప్రతినిధుల మద్దతు ఎలాగూ ఉండనే ఉంటుంది.

  • విభజన ఇష్టం లేకనే :

వినియోగదారుల  సౌలభ్యం కోసం డిచ్ పల్లి లో  డివిజన్ ను ఏర్పాటు చేయాలని మంజూరు చేసారు. అప్పటి నుంచి కుంటి సాకులు చెప్తూ కాలం వెల్లధీస్తున్నారు. సర్కిల్ కు  ఉన్న ముఖ్యాధికారి ముందుగా వినియోగదారునికి ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే విభజన చేయాలని వచ్చిన ఆదేశాలను పాటించి వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. అలా గాకుండా  కార్యాలయాలకు పరిమితమై డిచ్ పల్లి డివిజన్ ప్రస్తావన మాటను తీరిక వేళల్లో తీసి నవ్వులాటగా అడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

  • తప్పుల తడకల జాబితా:

నేడే విడుదల అన్నట్లుగా 5న వెల్లడించాల్సిన జాబితాను మరునాడు మద్యాహ్నం తర్వాత  డివిజన్ లలో వెలువరించారు. గత కొన్ని రోజులుగా తమ సీనియరిటి లిస్టును ఇవ్వాలని పలుమార్లు అధికారులను సిబ్బంది బతిమిలాడుకున్నారు. అయినా చలించలేదు. ప్రస్తుతం డివిజన్ విభజన కోసం సీనియరిటి జాబితాను ముందుగా ప్రకటించి అభ్యంతరాలు లేకపోతే  తదుపరి బదిలీ ఉత్తర్వులను 10 వ తేదీన ఇవ్వనున్నామని తెలిపారు. గతంలో సిబ్బంది అడిగినప్పుడు సీనియారిటి జాబితా ఇచ్చి ఉంటే అప్పట్లోనే సమస్య పరిష్కారం అయ్యి ఉండేది. విభజనను నిలిపి ఉంచేందుకు తప్పుల తడకల జాబితాను వెలువరించి ఆ ఇద్దరు ఆడుతున్న సరికొత్త నాటకంలో భాగమని ఓఅండ్ఎం సిబ్బంది  ఆగ్రహ జ్వాలలు బయటకు విసురుతున్నారు.

  • ఆర్మూర్ డివిజన్ లో…. 

పుట్టిన తేది, విధుల్లో చేరిన, పదోన్నతి పొందిన తేదీలు లేకుండా.. అందులోనూ కొందరి పేర్లను తప్పించి సీనియారిటి జాబితాను వెల్లడించారు. వెనుకవి ముందుకు, ముందు రావాల్సినవి వెనక్కి రావడంపై  ఇదేమని సంఘ నాయకులు ప్రశ్నిస్తే, అది కేవలం  సమాచార నిమిత్తం అని బుకాయింపు మాటలు చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది.

  • నిజామాబాద్ డివిజన్ లో ….

డిచ్ పల్లి  డివిజన్ కు ఓఅండ్ఎం సిబ్బంది కేటాయింపు నిమిత్తం వారి నుంచి ఆప్షన్స్ తీసుకున్నారు. దీనిని ఏ ప్రాతిపాదికన  జాబితా ప్రకటించాలో తెలియని అయోమయంలో 2020లో తీసుకున్న పదోన్నతి ప్రకారం సీనియారిటి జాబితాను ప్రకటించారని సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.

  • స్పష్టికరణ కోసం సిఎండికి రాస్తా..

ఊరించి..ఊరించి పెట్టిన జాబితా తప్పుల తడకల ఉందని ఎస్ ఈ ని సంఘ నాయకులు నిలదీసారు. గత కొన్నాళ్లుగా అడిగినా..  సీనియారిటి లిస్టును  ఇవ్వలేదు, ఇవేమీ లేకుండానే విభజన కోసం ప్రకటనను ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. అప్పుడాయన ఏమన్నారో తెలుసా .. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే  లిఖిత పూర్వకంగా ఇవ్వండి స్పష్టికరణ (క్లారిఫికేషన్) కోసం సిఎండికి రాస్తానని చల్లగా చెప్పడం కొసమెరుపు..