రాజంపేట, బతుకమ్మ :
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) యం.రాజేష్ చంద్ర రాజంపేట పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ అప్‌లోడ్ ప్రక్రియ, సిబ్బంది నిర్వహణ (మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్), అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. తనిఖీ సందర్భంగా కేసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు మర్యాదపూర్వకంగా, పారదర్శకంగా, నాణ్యమైన పోలీసు సేవలను అందించడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో సౌమ్యంగా వ్యవహరించి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీసు సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
