- ద్వాదశ దినకర్మలో పాల్గొన్న సీ.ఎం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు ఆర్.భూపతి రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీనర్సమ్మ గత నెల 29న స్వర్గస్తులు అవగా, శుక్రవారం నిజామాబాద్ లో నిర్వహించిన ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిజామాబాద్ చేరుకున్న సీ.ఎంను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఇతర జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోర్గాం(పి) శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ కు చేరుకుని ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీ.ఎం రేవంత్ రెడ్డి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీ.ఎం తో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, అధికారులు, అనధికార ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు ద్వాదశ దినకర్మలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ ద్వారా కలెక్టరేట్ కు చేరుకుని, హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా, విస్తృత స్థాయిలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
