Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 6:41 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన

 

. . . నర్సరీ, అంగన్‌వాడీ కేంద్రం, పీహెచ్‌సీ, వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పలు ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా హాజీపూర్ తండాలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ, నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మాచాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.

 

District Collector's extensive tour in Yellareddy Mandal.

 

చిన్నారుల విద్యాభ్యాసం, పౌష్టికాహారం, హాజరు వివరాలను అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. తదుపరి మత్తమాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్య సిబ్బంది హాజరు, ఆసుపత్రి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని వైద్య సిబ్బందికి సూచించారు.

 

District Collector's extensive tour in Yellareddy Mandal.

 

అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. తదుపరి సర్దల్‌పూర్ గ్రామాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

 

District Collector's extensive tour in Yellareddy Mandal.