- బల్దియాలో అవినీతి ఆరోపణలపై ఆరా తీసిన ఆర్జెడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తర్వాత నగరపాలక సంస్థను సందర్శించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు పాలకవర్గం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సెప్టెంబర్ మొదటి వారంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. నగరపాలక సంస్థ రెవిన్యూ విభాగంలో లంచాలు లేనిదే అధికారులు పనిచేయడం లేదని సెక్షన్ అధికారులను ప్రసన్నం చేసుకోకుండా పనులు జరగడం లేదని ఇటీవల మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ వినయ్ కృష్ణారెడ్డి నగరపాలక సంస్థను సందర్శించడం కలకలం రేపింది. ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నగరపాలక సంస్థలు జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. బల్దియాలో లాంగ్ స్టాండింగ్ గా పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గురించి వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. మునుపెన్నడు లేని విధంగా బల్దియాలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్పెషల్ ఆఫీసర్ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం తాను చేసిన సూచనలను సలహాలను అధికారులు పట్టించుకోకపోవడంపై జిల్లా కలెక్టర్ అధికారుల తీరుపై గుర్రుగా ఉన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఏసీబీ దాడుల నేపథ్యంలో వరంగల్లోని రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆరా తీసినట్టు తెలిసింది. ఇటీవల ఏసీబీకి రెవిన్యూ ఇన్స్పెక్టర్ దొరికిన విషయం విధితమే. అధికారుల సూచనల మేరకే లంచాలు తీసుకోవడం జరిగిందని వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జెడి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఈ విషయంలో వివరణ కోరినట్టు తెలిసింది. నిజామాబాద్ బల్దియాలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆర్జెడి వివరణ కోరడంతో బల్దియా ఉద్యోగుల్లో భయం పట్టుకుంది.