Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 April 2025, 6:50 pm Posted by : ramakrishna

సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం

  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
  • లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని 17వ డివిజన్ పూలే అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం సన్నబియ్యం లబ్ధిదారులతో సహ భక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవాడి కుటుంబం ఆనందంతో పెద్దోలు తినే బియ్యం పేదోలు తింటున్నారని తెలిపారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ పథకం పేద  ప్రజల కడుపు నింపడానికే 80 శాతానికి పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగనివ్వొద్దన్నారు. గోదాముల నుంచి బియ్యం రవాణా, రేషన్‌ షాపుల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయాలి అని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీలర్లుగానీ, అధికారులు గానీ ఏమైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. కోట్లు పెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసిన అది పక్కదారి పట్టిందన్నారు. ఇప్పుడు రూ.13వేల కోట్లు వెచ్చించి 30 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్నామన్నారు. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, సభ్యుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన పేదలందరినీ లబ్ధిదారులుగా నమోదు చేస్తామని చెప్పారు.

Distribution of ration rice is a historic decision