నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 7 నుండి జరగబోయే అందాల పోటీలకు వ్యతిరేకంగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో వార్డులలో శనివారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు అంజలి, పిడిస్ యు జిల్లా కమిటీ సభ్యుడు మైపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలని, ఇదివరకు ఎప్పుడూ జరగని అందాల పోటీలకు ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయని అన్నారు. ఇప్పటికే అనేక రకాల అఘాయిత్యాలు మహిళలపై జరుగుతున్నాయన్నారు. రోజు రోజుకి హింస పెరుగుతున్న క్రమంలో ఈ పోటీలు నిర్వహించడం కరెక్ట్ కాదని ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదని తెలిపారు. పెట్టుబడిదారులకు అమ్మాయిల అర్థనగ్న ఫోటోలతో బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప మరి దేనికి ఉపయోగపడవని అన్నారు. దీన్ని రద్దు చేయాలని అన్ని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సంధ్య, సునంద, పద్మ, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, కళ తదితరులు పాల్గొన్నారు.
