Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 5:03 pm Posted by : ramakrishna

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బతుకమ్మ, బోధన్ : సంక్షేమం అందరికీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణం, మండల పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. పట్టణం, మండల పరిధిలో మొత్తం 245 మంది అర్హులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయి అని చెప్పారు. గత పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు గుణపాఠం చెబుతూ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని వ్యాఖ్యానించారు. “ప్రజలు మాపై నమ్మకం ఉంచి గెలిపించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మా ధ్యేయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బుకు లోబడకుండా నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలని ప్రజలు మరోసారి చూపించాలి,” అని అన్నారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, అంబులెన్స్ సేవల దోపిడీ చర్యలపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రజలను దుబారా బిల్లులతో మోసం చేసే ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేసి, అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్, గడుగు గంగారెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, గంగా శంకర్, పాషా మొయినుద్దీన్, తూము శరత్ రెడ్డి తదితర నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Distribution of Kalyana Lakshmi and Shaadi Mubarak cheques