- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో మంగళవారం స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని సెగ్మెంట్లలో ఏకకాలంలో పండుగ వాతావరణంలో జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సచివాలయం నుండి మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీ.ఈ.ఓ దివ్య దేవరాజన్ తదితరులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన (మంగళవారం) అన్ని సెగ్మెంట్లలో వడ్డీ లేని రుణాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీ.సీ అనంతరం కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఐ.కే.పీ ఏపీఎంలు, సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని వారికి ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో గల 21,996 స్వయం సహాయక సంఘాలకు రూ. 23.26 కోట్లు వడ్డీ లేని రుణాల కింద పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కార్యోన్ముఖులను చేశారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టే ఈ కార్యక్రమంలో మండల, గ్రామ మహిళా సమాఖ్యల ప్రతినిధులు అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మద్యాహ్నం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఐ.కె.పీ అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వారి ఇంటి వద్దకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిశిత పర్యవేక్షణ జరుపుతున్నామని, నిర్లక్ష్యానికి తావివ్వకుండా గడువులోపు అర్హులైన అందరికి ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తయ్యేలా కృషి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, ఐ.కె.పీ అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
