- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు. ఒక్కో జోన్ వారీగా మంజూరైన పనుల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఏ మేరకు నిధులు ఖర్చు చేశారు, ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగింది తదితర వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో సీ.సీ, బీ.టీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు, రోడ్ల నిర్మాణాలు ఇంకనూ ప్రారంభం కాకపోవడం పట్ల కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు చేపట్టి, నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లతో ఒప్పందం ఉన్నప్పటికీ, పనులను ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్ణీత గడువు లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, పనులు చేపట్టకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకుని సదరు కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు సౌకర్యాల కల్పన విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని, కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే ధోరణిని అవలంభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు తదితర అన్ని రకాల పనుల ప్రగతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యానికి తావు లేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకుని, ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గడువు లోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ఏ చిన్న పని కూడా పెండింగ్ లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి సమీక్ష జరిపే సమయానికి అన్ని పనులు ప్రారంభమై, స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ సహాయ రవీంద్రసాగర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
