Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 8:01 pm Posted by : ramakrishna

సిద్దిపేటలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి

 

. . . మాజీ మంత్రి హరీశ్‌రావు

 

సిద్దిపేట, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేటలో రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేట చిన్నబోయిందని, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పడిపోయాయని హరీశ్‌రావు అన్నారు. వ్యాపారాలు తగ్గిపోవడంతో ఎక్కడ చూసినా ‘టు లెట్’ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో కార్లు, డీసీఎంలకు నెలకు 15 వరకు గిరాకీలు వచ్చేవని, ప్రస్తుతం ఆరు, ఏడు గిరాకీలు కూడా దొరకడం కష్టంగా మారిందన్నారు. దీంతో డ్రైవర్లు, వాహన యజమానుల జీవన పరిస్థితులు ఆర్థికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రహదారులపై గుంతలు లేకుండా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ఏ రోడ్డు చూసినా గుంతలే కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు. పాత బస్‌స్టాండ్‌ను వేగంగా ఆధునికీకరించి పూర్తి చేశామని, అయితే ప్రస్తుతం 1000 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, శిల్పారామం, రైల్వే బ్రిడ్జి, టూరిజం ప్రాజెక్టు వంటి పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయని ఆరోపించారు. సిద్దిపేటలో అన్ని రకాల విద్యా అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్, అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీలను తీసుకొచ్చామని హరీశ్‌రావు తెలిపారు. కలెక్టరేట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు తరలించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేయవచ్చని, కానీ సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న కాలేజీని తరలించడం అన్యాయమని అన్నారు.  ఈ దొంగ చర్యలను చూస్తూ ఊరుకోను. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆగిపోయిన పనులన్నింటినీ రెట్టింపు వేగంతో పూర్తి చేస్తాం. సిద్దిపేటలో నిలిచిపోయిన అభివృద్ధిని పూర్తిచేసి తీరుతాం” అని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, మందుల కొరత ఉందని, దీంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. అయితే మంచి రోజులు వస్తాయని, ఎవరూ ధైర్యం కోల్పోవద్దని ప్రజలకు సూచించా రు. వాహనాలు నడుపుతూ ఎక్కువ సమయం కూర్చునే డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హరీశ్‌రావు సూచించారు. రోజుకు కనీసం 40 నిమిషాలు నడవాలని, చెమట పట్టేలా వ్యాయామం చేయాలని చెప్పారు. గుట్కా, బీడీలు, సిగరెట్లు, మద్యం వంటి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. “తక్కువ తినండి.. ఎక్కువగా వాకింగ్ చేయండి. అవకాశం ఉన్నవారు యోగా చేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆయన అన్నారు.

 

Development works in Siddipet have come to a halt.