Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2025, 6:48 pm Posted by : ramakrishna

ప్రజాపాలన గ్రామ సభలు కాదు బోగస్ సభలు

. . . కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి గ్రామ సభల పేరిట ప్రజలను మోసం చేస్తుంది

. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ, బతుకమ్మ : 

రాష్ట్రంలో రెండు రోజులుగా ప్రజాపాలన పేరిట జరుగుతున్న సభలను పరిశీలిస్తే అవి గ్రామసభలు కాదని బోగస్ సభలుగా ఉన్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ లోని తన  నివాసంలో వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామసభల పేరిట ప్రజలను మోసం చేస్తుందన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లప్పుడు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసంతో రేవంత్  రెడ్డి గద్దెనెక్కాడన్నారు. ఇప్పుడు ప్రజాపాలన పేరిట ఏడాది క్రితం దరఖాస్తులు తీసుకుని సర్వే చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ను అడుగడంలో ఆంతర్యమేమిటన్నారు. ఏడాది పొడవునా తీసుకున్న దరఖాస్తుల  సంగతేమిటని, అవి ఉత్తుత్తి సర్వేలా అని ప్రశ్నించారు. త్వరలో సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు గ్రామసభల డ్రామా అన్నారు. లబ్దిదారుల జాబితాలను గ్రామసభల్లోనూ పెట్టకపోతే అధికారులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుబంధు  రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ పథకాల తులం బంగారం ఏమైందని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. 5 లక్షల ఫీజు కార్డు, స్కూటీ, నిరుద్యోగ భృతి ఏదన్నారు. బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి నియోజకవర్గంలో 31 వేల మంది రైతులకు రుణమాఫీ చేయించు అని సవాల్ విసిరారు. రైతుబంధు ఇప్పించు, కోఢళ్ళకు రూ.2500, అత్తకు రూ.4 వేలు ఇప్పియు , మహిళలకు కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇప్పించాలని అప్పుడు  సిపాయి అవుతావని నా మీద  ఏడిస్తే సిపాయి కావని అన్నారు.