. . . నల్ల రిబ్బన్ లతో నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ కార్మికులు, డ్రైవర్ లు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తక్షణమే వేతనాలు ఇవ్వాలని, సిఐజి గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, టీయుసీఐ, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు నల్ల రిబ్బన్లను ధరించి వీధుల్లో తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవికిరణ్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులపై అధికారులు కక్షాపూరిత వైఖరిని ప్రదర్శించడం సరికాదన్నారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంటాక్ట్ ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి, సిఐజి గ్రూపుల కార్మికులకు ఇవ్వకపోవడం అధికారుల కక్షాపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను కొనసాగిస్తూ, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కార్మికుల గ్రూపులుగా చేయాలన్నారు. అదేవిధంగా ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు అందజేయాలన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26వేలు ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులు డ్రైవరులు వర్మ, శివ, రాము, నర్సింగరావు, నరేష్, శ్రీధర్, హిమాం, శాంతి కుమార్, విజయ్ కుమార్, రాము, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.