Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 5:51 pm Posted by : ramakrishna

స్థల సేకరణలో జాప్యాన్ని నివారించాలి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజోపయోగ పనుల కోసం అవసరమైన స్థల సేకరణలో జాప్యానికి తావులేకుండా ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్సు హాల్ లో మంగళవారం స్థల సేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత వారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. రోడ్ల నిర్మాణాలు, విస్తరణతో పాటు నూతన విద్యా సంస్థలు, వసతి గృహాలు, వైద్యశాలలు, మహిళా శక్తి భవనాలు వంటి వాటికి సొంత భవనాల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను సకాలంలో అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని, ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుతూ త్వరితగతిన స్థల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఎంపిక చేసే స్థలాలు ఆయా అవసరాలకు అనువైనవిగా, ప్రజలకు ఉపయుక్తంగా నిలిచేలా ఉండాలని కలెక్టర్ సూచించారు. స్థల సేకరణలో పరిహారం ఖరారైన వాటికి సంబంధించి చెల్లింపులు కూడా వెంటనే జరిగేలా చొరవ చూపాలని అన్నారు. సమావేశంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మెప్మా పీ.డీ రాజేందర్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు భాస్కర్, రైల్వే, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్, టీజీఐఐసి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.