. . . దంపతులకు గాయాలు
కామారెడ్డి, బతుకమ్మ :
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పలవాయి గ్రామానికి చెందిన మేదరి శ్రీనివాస్ (40), అతని భార్య మేదరి గంగామణి (30) స్కూటీపై కామారెడ్డి నుంచి ఉప్పలవాయి గ్రామానికి వెళ్తుండగా వడ్లూరు రోడ్డు కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వద్ద అనుకోని ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న సమయంలో సైడ్ నుంచి వచ్చిన జింక అకస్మాత్తుగా స్కూటీని ఢీకొట్టడంతో దంపతులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా, శ్రీనివాస్ కాలు విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అవుట్ పోస్ట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
