Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 9:56 pm Posted by : ramakrishna

గుట్ట ప్రాంతంలో కళేబరాలు లభ్యం..

 

. . . అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. బస్వాపూర్ గ్రామ శివారులో చిరుత దాడికి గురై కనిపించకుండా పోయిన గొర్రె పోటేల కాళేబరాలు సోమవారం గుట్ట ప్రాంతంలో లభ్యమయ్యాయి. దీంతో బస్వాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం తెల్లవారుజామున బస్వాపూర్ గ్రామానికి చెందిన వాగ్మరే నాగనాథ్ తన గొర్రెల మందను పంటపొలంలో ఎరువుల కోసం వలలు వేసి ఉంచాడు. అదే సమయంలో చిరుత గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రె పోటేలను ఎత్తుకెళ్లింది. ఘటనపై యజమాని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా, బీట్ అధికారి రాములు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత అడుగుజాడలను గుర్తించి దాడిని నిర్ధారించారు. శని, ఆదివారాల్లో యజమానితో కలిసి గొర్రె పోటే కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే సోమవారం బస్వాపూర్ శివారులోని గుట్ట ప్రాంతంలో గొర్రె పోటేల కాళేబరాలు గుర్తించినట్లు బీట్ అధికారి రాములు తెలిపారు. పోస్టుమార్టం కోసం పశువైద్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. నాలుగు నెలల తర్వాత మళ్లీ చిరుత సంచారం ప్రారంభమైన నేపథ్యంలో బస్వాపూర్, బంగారుపల్లి, దోస్‌పల్లి, డోన్‌గాం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.