నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ షిర్డీ సాయి కృపా నగర్ లో ఉన్న సద్గురు ధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమంలో రెండు రోజులపాటు దత్త జయంతి ఉత్సవాలు కొనసాగుతాయని ఆశ్రమ వ్యవస్థాపక శాశ్వత చైర్మన్, దత్త ఉపాసకులు ఇప్పకాయల హరిదాసు స్వామిజీ తెలిపారు. 14వ తేదీ సాయత్రం నుంచి స్వామి వారికి అభిషేకంతో దత్త జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 15వ తేదీ ఆదివారం సాయత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని వెల్లడించారు. ఆదివారం రోజున మహా అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. దత్త జయంతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని హరిదాస్ స్వామి కోరారు.
